కాల్చిచంపినవారే నివాళులర్పిస్తారా?


తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించాలనుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. నాడు వందల మంది యువకులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోడానికి కారణమెవరో ఆలోచించుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. నాడు 1969లో వందల మంది తెలంగాణ ప్రజలను కాల్చిచంపింది మీరే.. ఇప్పుడు అమరవీరులకు నివాళులర్పించేది మీరేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరని, మోసపోరని చెప్పారు. ఆయన ఆదివారం తెలంగాణభవన్‌లో ప్రభుత్వ విప్‌లు గంప గోవర్ధన్, బీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ సభకు అనుమతి ఇవ్వలేదంటూ జానారెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని..

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో తాము ఎమ్మెల్యేలుగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, బలిదానాలు చేసుకున్నప్పుడు పరామర్శకు వెళ్లినా కూడా అనుమతించలేదని, గేటు వద్దే అనేకమార్లు అరెస్టు చేశారని గుర్తుచేశారు. అప్పుడు తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే ఓయూ పరిధిలో వీసీనే నిర్ణయాలు తీసుకుంటారని, ప్రభుత్వానికి సంబంధంలేదని సమాధానమిచ్చారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా లేనప్పుడు మరో తీరుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1969లో 369 మందిని పిట్టల్లాగా కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా? డిసెంబర్ 9 ప్రకటనను వెనుకకు తీసుకోవడంతో మలిదశ ఉద్యమంలో వందల మంది బలవన్మరణాలకు కారణం కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. ఆత్మహత్యలు జరుగకముందే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాకుండేది అన్నారు. కాల్చిచంపింది మీరే.. నివాళులర్పించేది మీరేనా అంటూ ప్రశ్నించారు.

మాకేం భయం.. ప్రజలకన్నీ తెలుసు..

రాహుల్ పర్యటనతో ఎలాంటి భయంలేదని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలే న్యాయనిర్ణేతలని, వారికి వాస్తవాలు తెలుసని, వారు తెలివైనవారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని.. రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించవద్దని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని.. నాలుగేండ్లలోనే పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నదన్నారు. తాగునీటికి కొరత లేకుం డా చేశామని, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపామని చెప్పారు. 24గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ విధానం లేదని చెప్పారు.
Harishrao1

మ్యానిఫెస్టోలో లేనివీ చేస్తున్నాం..

ఎన్నికల్లో హామీలు ఇవ్వకున్నా అనేక పథకాలను ప్రవేశపెట్టామని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో తమ గ్రామాలను కలుపాల్సిందిగా అక్కడి కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతుబంధు లాంటి పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలుచేయాల్సిందిగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు అడుగుతున్నారని అన్నారు. వరికి 90 శాతం కనీస మద్దతు ధర ఇచ్చిన రాష్ట్రం తెలంగాణే అని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సారెస్పీని 1963లో ప్రారంభించి 2014వరకు కూడా పూర్తిచేయలేదన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో కొత్తగా 14లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కరంటు కోతలు ఉండేవని గుర్తుచేశారు. రైతులు ఎరువులు, విత్తనాలు, కరంటు కోసం కష్టాలుపడ్డ విషయం కాంగ్రెస్ నేతలకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కరంటు కొతలపై, నీటి కొరతపై ప్రదర్శనలు జరిగేవని గుర్తుచేస్తూ.. గత నాలుగేండ్లలో ఏనాడైనా ఇలాంటివి జరిగాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ ఉందా అని వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం అనే విషయం మ్యానిఫెస్టోలో ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా లక్ష ఉద్యోగాలను ఇస్తామని స్పష్టం చేశారు.

ఏదీ తెలంగాణపై కాంగ్రెస్ ప్రేమ?

తెలంగాణపై కాంగ్రెస్ నాయకులది రాజకీయ ప్రేమ తప్ప నిజమైన ప్రేమ కాదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సమస్యలపై, ప్రత్యేక హోదా హక్కుల గురించి రాహుల్‌గాంధీ ఏనాడైనా పార్లమెంటులో మాట్లాడారా? అని ప్రశ్నించారు. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీతోపాటు తెలంగాణకు పారిశ్రామిక, వాణి జ్యరాయితీలు, ప్రోత్సాహకాలు వర్తింపజేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. వాటి గురించి సీడబ్ల్యూసీలో మాట్లాడలేదని, పార్లమెంట్‌లోనూ ప్రస్తావించలేదని విమర్శించారు. తెలంగాణకు విభజన చట్టంలో ఉన్నవాటి గురించి ఏనాడైనా మాట్లాడారా?.. టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడుతుంటే కనీసం మద్దతు కూడా తెలుపలేదు. రాహుల్ ఈ పర్యటనలో ఏం చెప్పదల్చుకున్నారు అని ప్రశ్నించారు. ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి తెలంగాణ నుంచి పరిశ్రమలను ఖాళీచేయాలా అని నిలదీశారు. రాహుల్ తెలంగాణ పారిశ్రామికవేత్తలతో నిర్వహించే సమావేశంలో దీనిపై ఏం చెప్తారు?.. పరిశ్రమలు తరలిపోతే ఇక్కడి యువకులు నిరుద్యోగులుగా మారాలా అని ప్రశ్నించారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు బీజేపీతో కలిసిపార్లమెంట్‌లో చట్టానికి ఆమోదం తెలిపింది కాంగ్రెస్ కాదా? అన్నారు. నాడు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది టీఆర్‌ఎస్ అని, తమఎంపీలు ఢిల్లీలో నిరసన తెలిపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మం డలి సీడబ్ల్యూసీలో తెలంగాణకు చెందిన ఒక్కనాయకుడికి కూడా స్థానంలేదని.. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో తెలంగాణవారు ఒక్కరుకూడా లేరని చెప్పారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేత ల్లో జాతీయస్థాయిలో అర్హులులేరా అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీచేయలేని కాంగ్రెస్.. ప్రతిపక్షంలో ఉండికూడా అన్యాయం చేయాలనే చూస్తున్నదని విమర్శించారు.

15న బీసీ రుణాల పంపిణీ

 

etela-rajender

 

బీసీల్లో అర్హులైన ప్రతిఒక్కరికీ సబ్సిడీ రుణాలు అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు బీసీ సంక్షేమశాఖ అన్ని చర్యలు చేపట్టింది. వందశాతం సబ్సిడీతో రూ.50 వేలు, 80 శాతం సబ్సిడీతో రూ.లక్ష రుణం అందించనున్నది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల కులాలు ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించడం లక్ష్యంగా.. అర్హులందరికీ సబ్సిడీ రుణాలు అందించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలను పకడ్బందీగా అమలుపర్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీ సంక్షేమశాఖ ద్వారా లబ్ధిదారులకు రుణ సహాయం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.2 వేలకోట్ల వరకు బీసీ వర్గాలకు పూర్తి సబ్సిడీతో రుణాలివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి అధికారులు, రజక, నాయీబ్రాహ్మణ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సబ్సిడీ రుణాల పంపిణీ, విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చించారు.

పంద్రాగస్టున లాంఛనంగా ప్రారంభం

ఈ నెల 15న రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో బీసీ సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని మంత్రులు ఈటల, జోగు రామన్న చెప్పారు. అదేరోజు ప్రతిజిల్లాలో 100 మంది చొప్పున బీసీలకు రుణాల చెక్కులను అందజేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కూడా బీసీ రుణాల అందజేత కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదరికంలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిందని మంత్రులు వెల్లడించారు. సమావేశంలో మాజీమంత్రి బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో అగ్రగామిగా తెలంగాణ.

 

KTRతెలంగాణ ఔషధరంగం వాయువేగంతో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు ప్రపంచ శ్రేణి సంస్థలను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చూపిస్తున్న శ్రద్ధతో గడిచిన నాలుగేండ్లలో తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌లోకి రూ.10,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించిన టీఎస్‌ఐపాస్‌తో ఇప్పటిదాకా దాదాపు 700 పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్‌అండ్‌డీకి చెందినవే 100కుపైగా ఉండటం గమనార్హం. ఈ పెట్టుబడులతో కొత్తగా 70,000 ఉద్యోగాలు అందివచ్చాయి.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. దేశంలోనేగాక ఆసియా ఖండంలోనూ లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, తయారీల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. గత నాలుగేండ్లుగా అనేక కొత్త సంస్థలను ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తుండటంతో విస్తరణ ప్రణాళికలతో ఫార్మా రంగం వర్ధిల్లుతున్నది. నోవార్టీస్, బయోలాజికల్ ఈ, లారస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా వంటి కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. మరోవైపు ప్రపంచస్థాయి సంస్థల చూపంతా కూడా ఇప్పుడు ఇక్కడే నెలకొన్నది. ఇప్పటికే ఫెర్రింగ్ ఫార్మా, కేమో, జీఎస్‌కే, సిన్జెన్, ైస్లెబ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి అనేక విదేశీ దిగ్గజాలు తెలంగాణకు వచ్చాయి. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి స్థానిక దిగ్గజాలూ రాష్ట్రంలో ఉండనే ఉన్నాయి. దీంతో ఔషధ రంగంలో తెలంగాణ వాయు వేగంతో పరుగులు పెడుతున్నది.

టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడుల వరద

నూతన పారిశ్రామిక అనుమతుల విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటిదాకా సుమారు 700 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో సుమారు 100 వరకు ఆర్‌అండ్‌డి రంగంలో ఉన్నాయంటే తెలంగాణలో ఉన్న పరిశోధన అనుకూల పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ స్నేహపూర్వక వాతావరణం వలన సుమారు 80 ప్రాజెక్టులు ఇప్పటికే తమ పనులు ప్రారంభించాయి. ఈ మొత్తం పెట్టుబడుల వలన సుమారు 20వేల హైవాల్యూ పరిశోధన ఉద్యోగాలతోపాటు 50వేల ఉద్యోగాలు ఫార్మా తయారీ రంగంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక గడిచిన నాలుగేండ్లలో రూ.10,222 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయి. ఇందులో రూ.3,000 కోట్లు కేవలం ఆర్‌అండ్‌డీలోకే రావడం జరిగింది.

తెలంగాణ ఎగుమతుల్లో 36 శాతం లైఫ్ సైన్సెస్‌వే

నూతన పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ఫార్మా రంగం ఎగుమతుల విషయంలోనూ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. తెలంగాణ ఎగుమతుల్లో లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే 36 శాతంతో సింహాభాగంలో ఉన్నది. జాతీయ సగటు 1.18 శాతం మాత్రమే. గత నాలుగు సంవత్సరాల్లో ఎగుమతుల విషయంలో సుమారు 2.41 శాతం వృద్ధిని తెలంగాణ అందుకున్నది. దేశ సగటుకి రెట్టింపుతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. ఇక తెలంగాణ రాష్ట్రం శిక్షణ కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫార్మాకోపియా.. ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి యూనివర్సిటి గ్రాడ్యుయేట్లకు ఔషధ రంగ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. వ్యాక్సిన్లు, బయో ఫార్మా, ఫార్మాస్యూటికల్ తయారీ వంటి ఇతర నైపుణ్యాలకు కూడా శిక్షణ అందించేందుకు సిద్ధం అవుతున్నది. మొత్తానికి గత నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోపాటు కేటీఆర్‌ల కృషి.. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నది. ముఖ్యంగా అనేక ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలను, అగ్ర నాయకత్వాన్ని కేటీఆర్ ప్రత్యక్షంగా కలువడం బాగా కలిసొచ్చింది. అమెరికా తదితర దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులకు హాజరై తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించడంలో కేటీఆర్ విజయం సాధించారు.

మా విధానాలు ఫలిస్తున్నాయ్: కేటీఆర్

లైఫ్ సైన్సెస్ పరంగా తెలంగాణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. తెలంగాణకు సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా ఇక్కడ యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకుపోవాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్న ఆయన రాష్ర్టాన్ని వృద్ధిపథంలో నడిపించే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. అన్ని రంగాలను పరుగులు పెట్టించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందులోభాగంగానే రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ 2.0, మెడికల్ డివైసెస్ పార్క్ లాంటి ప్రాజెక్టులతోపాటు తాజాగా ప్రకటించిన బీ-హాబ్, లైఫ్ సైన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇన్నోవేషన్ ఫండ్, లైఫ్ సైన్సెస్ శిక్షణ కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఫార్మా రంగం వెలిగిపోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈసారి ఫార్మా ఎగుమతులు 19 బిలియన్ డాలర్లపైనే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) దేశీయ ఔషధ రంగ ఎగుమతులు 19 బిలియన్ డాలర్ల (రూ.1,31,100 కోట్లు)కుపైగానే నమోదు కావచ్చని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) అంచనా వేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2017-18) ఎగుమతులు 17.27 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా లేనప్పటికీ.. కొత్త మార్కెట్లలోకి ప్రవేశాలున్నందున ఈసారి 19-20 బిలియన్ డాలర్ల మధ్య ఎగుమతులు జరుగుతాయన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నది. ఇక ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే 17.76 శాతం వృద్ధితో 4.6 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. నిరుడు 3.9 బిలియన్ డాలర్లేనని గుర్తుచేశారు. ఈసారి ఉత్తర అమెరికా వాటా 17.67 శాతం ఎగిసి 1.40 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు.

ఆది నుంచీ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకమే కాంగ్రెస్ మనోగతం.

 

rahul-gandhi-angry‘తెలంగాణ ఇచ్చిందీ మేమే. తెచ్చిందీ మేమే’ అంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే గొప్ప లు చెప్పుకుంటున్నా ఆంధ్రప్రదేశ్‌లో 1956లో తెలంగాణ విలీనమైంది మొదలు ఇప్పటి వరకూ ఆ పార్టీ చరిత్రంతా తెలంగాణకు ద్రోహం చేయడమేనని టిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగానే ‘తెలంగాణకు మొదటి శత్రువు (విలన్) కాంగ్రెస్సే’ అని వ్యాఖ్యానించారని, ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నారని టిఆర్‌ఎస్ నాయకులు సోదాహరణంగా వివరించా రు. కెసిఆర్ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా 2001 మొదలు ఇప్పటిదాకా అదే మాటకు కట్టుబడి ఉన్నార ని, అయితే 2004లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని గుర్తుచేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను విలీనం చేయడం మొదలు తాజాగా పార్లమెంటులో మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానంపై చర్చ వరకూ తెలంగాణకు అడు గడుగునా ద్రోహం చేయడమే ఆ పార్టీ చరిత్ర అని టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్‌లు వ్యాఖ్యానించారు.

రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణపై నిర్ణయం: వి. ప్రకాశ్
“తెలంగాణకు కాంగ్రెస్ మొదటి విలన్ అని సిఎం కెసిఆర్ 2001లోనే చెప్పారు. టిడిపికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించే సందర్భంలోనే ఏప్రిల్ 27న జలదృశ్యంలో ‘తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్సే’ అని వ్యాఖ్యానించారు. చివరి వరకూ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక ఎత్తుగడగానే 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఆ పార్టీ నుంచే తెలంగాణను సాధించాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆ పార్టీతో ఎన్నికల సందర్భంగా పొత్తుకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్‌ను విలన్‌గానే చూశారు.

కాంగ్రెస్‌ను ఒత్తిడికి గురిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పని పరిస్థితిని సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అంతే తప్ప రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సే అని భావించలేం. ఇది ఇవ్వడం కాదు, తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నది. తెలంగాణ ఇవ్వకపోతే రాజకీయంగా పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ భావించి రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ఇస్తే అన్ని సీట్లనూ గెలిపించుకుంటామని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు. మామా అల్లుళ్ళు మాత్రమే టిఆర్‌ఎస్‌లో మిగులుతారని, అంతకు మించి ఆ పార్టీ ఉనికిలోనే ఉండదని, ఇక అంతా ‘మనదే’ అంటూ కాంగ్రెస్ ఎంపిగా ఉన్న వి.హనుమంతరావు కూడా వ్యాఖ్యానించారు. పార్టీని బతికించుకోడానికి, ఉనికిలో ఉండడానికి మాత్రమే తెలంగాణను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది.

పార్టీ కోణం నుంచి మాత్రమే నిర్ణయం తీసుకుంది తప్ప ప్రజల కోణం నుంచి కాదు. నిజానికి తెలంగాణ పట్ల నిజాయితీ ఉన్నట్లయితే యాదిరెడ్డి ఆత్మహత్య రోజే ఆ నిర్ణయం ప్రకటించి ఉండేది. వాయిదా వేసేది కాదు. కానీ నిర్ణయానికి ముందే శ్రీకాంతాచారి, కిష్టయ్య లాంటి వందలాది మంది తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1956లో తెలంగాణ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా అప్పటి కాంగ్రెస్ నాయకుల మెడలు వంచి తెలంగాణను ఆంధ్రలో కలిపింది. బూర్గుల రామకృష్ణారావు లాంటివారిని మనోవేదనకు గురిచేసి విలీనం కోసం ఒప్పించారు. అంతే తప్ప ఆయన ఐచ్ఛికంగా ఒప్పుకున్నది కాదు. కెవి రంగారెడ్డి, చెన్నారెడ్డిలను సైతం ఆ పార్టీ పెద్దలు చాలా వత్తిడికి గురిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విలీనం నిర్ణయం తీసుకునే సమయానికి ఇందిరాగాంధీ కూడా రాజకీయంగా ఒక మేరకు యాక్టివ్‌గానే ఉన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది వీధుల్లో కాల్చినా తెలంగాణను ఇవ్వాలనే నిర్ణయం తీసుకోలేదు. కనీసం పోలీసు కాల్పులపైనా న్యాయ విచారణ జరిపించలేదు. పెద్ద మనుషుల (జెంటిల్‌మెన్ ఒప్పందం) ఒప్పందాన్ని ఉల్లంఘించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. కెసిఆర్ రాజకీయ ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది తప్ప తనంతట తానుగా నిజాయితీగా తీసుకున్న నిర్ణయం కాదు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కాంగ్రెస్సే తెలంగాణకు మొదటి విలన్‌” అని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

‘ప్రత్యేక హోదా’ తో మరోసారి మోసం : ఎంపి వినోద్ కుమార్
“ఇప్పటికే తెలంగాణలో ఒక తరాన్ని కాంగ్రెస్ మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తు తరాలకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమేకాక కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్‌గాంధీ స్వయంగా ప్రకటించారు. ఈ తీర్మానం చర్చ సందర్భంగా నేను రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు అన్ని రకాల అనుమతులనూ మంజూరు చేసేలా, పూర్తిస్థాయి ఖర్చులు ఇచ్చేలా ఆ రాష్ట్రానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సాగునీటి వనరులు లేని, ప్రాజెక్టులు లేని తెలంగాణకు మాత్రం జాతీయ ప్రాజెక్టు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ఫలితంగా తెలంగాణ రాష్ట్రం తన స్వంత ఆర్థిక వనరులతోనే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి వస్తోంది. తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న అంశాన్ని కాంగ్రెస్ విస్మరించింది. ఆ రకంగా తెలంగాణకు అన్యాయం చేసింది. ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇకపైన ‘జాతీయ ప్రాజెక్టు’ అనే విధాన నిర్ణయాలే ఉండవని ప్రకటించారు. దీంతో సాగునీటి ప్రాజెక్టుల ఖర్చును తెలంగాణ ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇక రెండవ విషయం… ‘ప్రత్యేక హోదా’. ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించాల్సి వస్తుంది. దీన్ని ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ రకాల పన్ను రాయితీలు లభిస్తాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టంలో ‘ప్రత్యేక హోదా’ అంశం లేనప్పటికీ ఆ రాష్ట్రం నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 2014లోనే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వ్యతిరేకించాయి.

ఈ నిర్ణయం ఫలితంగా ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతాయనేదే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆందోళన. సహజంగా ఇదే ఆందోళన తెలంగాణకూ ఉంది. తాజాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నొక్కిచెప్పింది. దీంతో తెలంగాణకు చాలా ఇబ్బందులు, నష్టం తప్పదు. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చినా అభ్యంతరంలేదుగానీ పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడంవల్ల తెలంగాణకు పారిశ్రామికంగా చాలా నష్టం జరుగుతుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం ద్వారా తెలంగాణకు మళ్ళీ నష్టం చేయనుంది. ఇప్పటికే ఒక తరాన్ని మోసం చేసిన కాంగ్రెస్ తాజా నిర్ణయంతో తెలంగాణలోని భవిష్యత్తు తరాలకు మళ్ళీ నష్టం చేయబోతోంది. ఇదే విషయాన్ని లోక్‌సభలోనే నేను రాహుల్‌గాంధీని ప్రశ్నించాను. సాగునీటి రంగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరిగినా పట్టించుకోని కాంగ్రెస్ జాతీయ ప్రాజెక్టు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి తెలంగాణను విస్మరించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో మరోసారి అన్యాయానికి గురిచేయనుంది” అని కరీంనగర్ ఎంపి బి.వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు.

ముచ్చటగా మూడు పథకాలు

CMKCR

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను బుధవారం నుంచి సర్కారు చేపడుతున్నది. ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను బల్క్‌గా గ్రామాలకు అందించనున్నారు. పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా పంద్రాగస్టు నాడు అన్ని గ్రామాలలో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడకూడదని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ప్రజలకు కండ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజలందరికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ముందుగా సర్కారు దవాఖానలను బలోపేతం చేసింది. అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఆ తరువాత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సిజేరియన్ ద్వారా ప్రసూతిచేసే విధానాన్ని పకడ్బందీగా నియంత్రించింది. కేసీఆర్ కిట్స్ విధానాన్ని తీసుకొచ్చి పేదింటి గర్భిణులు, పిల్లలకు అండగా నిలిచింది. ఇప్పుడు ప్రజలందరికీ కంటిచూపు మంచిగా ఉండాలనే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని చేపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
అన్నదాతలకు అండగా..
గ్రామసీమలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయరంగం పురోభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. స్వయానా రైతు అయిన ముఖ్యమంత్రికి రైతుల బాధలేమిటో బాగా తెలుసు. రైతుకు సర్కారు దన్నుగా నిలిస్తే ఎంత కష్టమైనా చేసి ఉత్పత్తిని పెంచుతారని, అభివృద్ధిలో భాగస్వాములవుతారని గుర్తెరిగారు. అందుకే ముందుగా భూమి సమస్యలను పరిష్కరించడానికి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ వెంటనే రైతు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఇచ్చారు. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం.. కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. మంత్రులు, అధికారులు, రైతు సమన్వయ సమితి నేతలు.. ఇందులో చురుకైన పాత్ర పోషించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలుచేయనున్నారు. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.
బడుగులకు బాసటగా..
బడుగువర్గాలు బలపడేలా చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. అన్ని వర్గాల బీసీ ప్రజలు, కులవృత్తులవారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నది. గొల్లకుర్మల ఆర్థిక ప్రగతి కోసం గొర్రెల పంపిణీ చేపట్టింది. గీత కార్మికుల రక్షణకు చర్యలు తీసుకున్నది. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చింది. ఎంబీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నది. ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీయే. ఈ విధంగా బడుగువర్గాలకు ఆర్థికసహాయం అందించే పథకాన్ని ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా ఆరోజు జిల్లాకు వందమంది లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్‌గా మంచినీటి సరఫరాను పంద్రాగస్టునాడే అందించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు పూర్తిచేశారు. మరోవైపు రాష్ట్రంలోని 12,751 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నెలపాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గ్రామప్రజలందరినీ భాగస్వాములను చేసి స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా సీఎం కేసీఆర్ పంద్రాగస్టు నుంచే ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ కోతలు

h

కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ కోతలు గుర్తొస్తాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

“దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది.ఎన్నికల్లో హామీ ఇవ్వని అంశాలను కూడా నెరవేర్చాం. రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు చూసి కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేండ్లలోనే 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించాం. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా? కాంగ్రెస్ పాలన బాగుంటే సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉంటాయి. ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఇప్పుడు తెలంగాణ ఉంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తొస్తాయి. రైతులకు ఏ రాష్ట్రమైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా?” అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

ఐటీ సిగలో పచ్చనిహారం దుర్గంచెరువు_

నానాటికీ కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. దుర్గం చెరువు సుందరీకరణ, అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శనివారం వెస్ట్ జోన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీకి కేంద్రంగా ఉన్న వెస్ట్ జోన్ పరిధిలో పూర్తిస్థాయిలో పచ్చదనంతో అభివృద్ధి పరుస్తున్న దుర్గం చెరువు ఈ ప్రాంతానికి ఒక పచ్చని హారంలా మారుతుందన్నారు. రహేజా సంస్థ సీఎస్‌ఆర్ పథకం కింద రూ.40 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందులో భాగంగానే ఇప్పటికే రూ.15 కోట్ల వరకు నిధులు వెచ్చించి సుందరీకరణ పనులు చేపట్టిందన్నారు. మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్న దుర్గం చెరువు మొదటి దశను ఈనెల చివరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

సమీపంలో ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న థీమ్ పార్కుపై ఆయన సమీక్షించారు. ప్రధానంగా దుర్గం చెరువులో సింహభాగం పచ్చదనంతోపాటు సందర్శించే ప్రజలందిరికీ ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. మిగిలిన పనులకు సంబంధించి ముందుకు వచ్చిన మరో ముగ్గురి డిజైన్లపైనా సమీక్షించిన మంత్రి వాటిపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధానంగా దుర్గం చెరువు పూర్తిస్థాయి అభివృద్ధితో కొత్త అందాలు రావడం తథ్యమని ఆశాభావం వ్యక్తంచేశారు. దుర్గం చెరువు పరిధిలో అభివృద్ధి చేయనున్న వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, హంపి థియేటర్, పచ్చదనం సహా ఇతర కళాత్మక అంశాలపై చర్చించారు. సమీక్షలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, వెస్ట్ జోన్ కమిషనర్ దాసరి హరిచందన, డీసీ మమత, రాజేందర్, డాక్టర్ బిందు తదితరులు పాల్గొన్నారు

.ghmc

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..

ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో ని చాలాప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీగా, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీగా కురువగా, ఇంకొన్ని జిల్లాలో ముసురుకున్నది. వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. ఇదే జిల్లాలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దిగింది. ఇక్కడ త్రుటిలో ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లాలో వర్షం కారణంగా కారు రోడ్డు కల్వర్టును ఢీకొనగా ఇద్దరు దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం రాయిగూడెం సమీపంలోని గోదావరి నీటిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను పోలీసులు రక్షించారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నా యి.

జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతున్నది. గోదావరికి వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం 25 సెం.మీ., ముదిగొండ మండలంలో 22.64 సెం.మీ., చింతకాని మండలంలో 13.06 సెం.మీ. వర్ష్షపాతం నమోదైంది. వర్షం కారణంగా జిల్లాలోని పలు రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా నీరు చేరుతున్నది. పలు మండలాల్లో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి చిరుజల్లులు మొదలై ముసురు కురుస్తున్నది. సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరుతుండగా చాలా చోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం శనివారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. మహబూబాబా ద్ జిల్లా కేంద్రం నుంచి వెళ్తున్న మున్నేరువాగు పొంగి ప్రవహిస్తున్నది. జనగామ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రాణం పోసినట్లయింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలో భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Rain6

భూపాలపల్లి జిల్లాలో భారీగా..

ఎడతెరిపి లేని వర్షంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తడిసిముద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ఏటూరునాగారం, ములుగు, పలిమెల, మహాదేవ్‌పూర్, కాటారం, మహాముత్తారం మండలాల్లోని పలు అటవీ
గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోడ కూలి మహిళ మృతి..

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామం లో ఓ ఇంటి గోడ కూలడంతో వల్ల ఇంట్లో ఉన్న జాలిగపు మల్లమ్మ(60) మరణించారు. సమాచారం అందగానే రేగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాల నుంచి మల్లమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారిలో తాడ్వాయి మండలం అంకంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దిగింది. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ప్రమాదం తప్పింది. కాగా గోదావరి నదిలో నీటి ప్రవాహం క్రమేణా పెరుగుతున్నది. గంటకు సెంటీమీటర్ చొప్పున గోదావరిలో ప్రవాహం పెరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ముసురు వర్షం పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. రెబ్బెన మండలంలో కైరిగూడ వెళ్లే దారిలో గుండాల వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. సిర్పూర్(యు) మండలం నుంచి జైనూర్‌కు వెళ్లే దారిలో సిర్పూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జగిత్యాల జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి మొదలైన భారీ వర్షం శనివారం రాత్రి వరకూ తగ్గలేదు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ముసురు కురుస్తూనే ఉన్నది. వికారాబాద్ జిల్లా తాండూరు, కోడంగల్, పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
Rain1

గ్రేటర్ హైదరాబాద్‌లో..

గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయింది. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా గ్రేటర్‌లో వాన జల్లు కురుస్తున్నది.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..

వరద నీరు చేరటంతో జయశంకర్ భూపాలపల్లిలోని రెండు ఓసీ గనుల్లో శనివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లాలో పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్‌ల్లో నీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది.Rain

కులవృత్తులకు ఊతం

Rajaka-sangam

ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధిరంగాల్లో రజకులు ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఎకరం స్థలంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రజకులకోసం హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతామని చెప్పారు. ప్రజలకు సేవచేస్తున్న కులాల అభ్యున్నతికి కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ రజక సంఘం ప్రతినిధులతో సమావేశమై, రజకుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని కులవృత్తులకు ప్రోత్సాహం కరువైందని, ఇప్పుడా కులవృత్తులను నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపర నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రజక యువతకు ప్రత్యామ్నాయ ఉపాధికోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేస్తామని చెప్పారు. రజక వృత్తిలో ఉన్న యాభై ఏండ్ల వయసు దాటినవారికి ఆసరా పింఛన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

 

రజకులకు వైద్యసేవలు

రజక సంఘం కోరుకున్న విధంగానే కార్యక్రమాలను అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మురికి దుస్తులు ఉతికే క్రమంలో అనారోగ్యం పాలవుతున్న రజకుల వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలు, జిల్లాకేంద్రాలు, పట్టణాల్లోనూ ధోబీఘాట్లు నిర్మిస్తామని తెలిపారు. ఉతికిన దుస్తులను నేలపై ఆరేయకుండా దండేలు ఏర్పాటుచేసే పద్ధతిని పెట్టాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ దవాఖానలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో దుస్తులను ఉతకడానికి అవసరమయ్యే వాషింగ్ మెషీన్లను ప్రభుత్వమే ఏర్పాటుచేస్తుందని, ఆ పనిని రజకులకే అప్పగిస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతోపాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లేఅవుట్లలో కచ్చితంగా దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయడానికి అనువుగా కొంత స్థలం రజక సంఘాలకు అప్పగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధోబీఘాట్లకు, వాషింగ్ మెషీన్లకు సబ్సిడీపై కరంటు సరఫరాచేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేశ్, కోఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కొలిపాక రాములు, ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి వెంకటరాములు, నాయకుడు కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Rajaka-sangam1

సీఎం కేసీఆర్‌కు రజక సంఘాల సమన్వయ కమిటీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లో రజక భవనానికి రూ.ఐదు కోట్లు, నల్లగొండ జిల్లా కేంద్రంలో రజక భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినందుకు రజక సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, కో కన్వీనర్ కోట్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొన్నే సంపత్, ముదిగొండ మురళి, పగడాల లింగయ్య, చిట్యాల రామస్వామి తదితరులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సీఎంవో అధికారులను ఆదేశించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఎరుకల భవన్

ఎరుకల కులస్థుల సామాజిక, విద్యాప్రగతికి దోహదంచేసేలా హైదరాబాద్ నగరంలో వారికి ప్రత్యేకంగా భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి అవసరమైన స్థలం కేటాయించడంతోపాటు నిర్మాణ వ్యయాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తనను కలిసిన ఎరుకల సంఘం ప్రతినిధులకు చెప్పారు. ఎరుకల ఉపాధికోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. సీఎంను కలిసినవారిలో తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు తదితరులున్నారు.

పాడి పశువుల పంపిణీ పథకం… పాడి రైతులకు గొప్పవరం…! పేదల సంక్షేమానికి ఇది నిదర్శనం …!!!

 

38888233_847085935496260_8630803533693714432_n

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ఇవాళ ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, ముల్కనూరు మహిళా సహకార సంఘంలోని సభ్యులతో పాటు రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ముల్కనూరు మహిళా సహకార డైరీలో అర్హులైన 88 మంది మహిళలకు బర్రెలను పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో రూ. 110.87 కోట్లతో పాల ఉత్పత్తిదారులకు బర్రెలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. గొప్ప సంకల్పం ఉన్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

let's read between lthe lines..